: విధ్వంసం వద్దు... అంతా రికార్డవుతోంది... గుర్తుంచుకోండి: కేసీఆర్ కు హరగోపాల్ హితవు
ఇప్పటికే 30, 40 ఏళ్ల పాటు నలిగిపోయాం, ఇక చాలు, ఎన్ కౌంటర్లు లేని తెలంగాణను తమకు ఇవ్వండని మానవహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. తెలంగాణ పల్లెల్లో విధ్వంసాన్ని సృష్టించవద్దని, ప్రతి అంశం రికార్డువుతుందని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పాటైన తొలి ప్రభుత్వం ఇదని... వందేళ్ల తర్వాత చరిత్ర రాసినా, ఈ మంత్రి వర్గం ఎలా పనిచేసిందన్న విషయం చరిత్రలో ఉంటుందని చెప్పారు. పై నుంచి అనుమతులు లేకుండా పోలీసులు ఎన్ కౌంటర్ చేయరని స్పష్టం చేశారు. వీలుంటే అరెస్ట్ చేయాలని... న్యాయవ్యవస్థల ద్వారా విచారణ జరిపించాలని సూచించారు. మవోయిస్టులైనా, మరెవరైనా సరే ఇదే విధానాన్ని అవలంబించాలని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోని పోలీసుల్లాగే, తెలంగాణ పోలీసులు కూడా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను ఏమీ చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశిస్తే, పోలీసులు ఏమీ చేయలేరని అన్నారు. వరంగల్ జిల్లా ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా, హరగోపాల్ ను సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా, మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.