: ఈ దఫా బాదుడే... పెరగనున్న 'పెట్రో' ధరలు!
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు స్వల్పంగా పెరగడంతో ఆ మేరకు పెట్రోలు, డీజిల్ ధరలను సవరించాలని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతి పక్షం రోజులకు ఒకసారి మార్కెట్ సరళిని అనుసరించి 'పెట్రో' ఉత్పత్తుల ధరలను పెంచడం, తగ్గించడం చేస్తున్న చమురు కంపెనీలు ఈ నెల 15వ తేదీన మాత్రం ధరలను సవరించ లేదు. కాగా, జూలై ఆఖరి వారంలో 43 డాలర్లకు పడిపోయిన బ్రెంట్ క్రూడాయిల్ ధర నేటి సెషన్లో 48.23 డాలర్ల వద్దకు చేరింది. ఇదే సమయంలో డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 41 డాలర్ల నుంచి 46 డాలర్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో రేపు జరిగే ఓఎంసీల సమావేశంలో స్వల్పంగా పెట్రోలు ధరల పెంపు తప్పదని తెలుస్తోంది. లీటరు పెట్రోలుపై రూ. 2 వరకూ భారం పడవచ్చని సమాచారం. ఇటీవలి కాలంలో పలుమార్లు పెట్రో ధరలు తగ్గగా, హైదరాబాదులో జూలై 1న రూ. 75.11 వద్ద ఉన్న లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ. 66.29 వద్దకు చేరిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో డీజిల్ ధర రూ. 56.79 నుంచి రూ. 48.45కు దిగివచ్చింది.