: 1400 మంది ఆత్మహత్య చేసుకుంటే... ఒక్క కుటుంబాన్నైనా కేసీఆర్ పరామర్శించారా?: ఉత్తమ్ కుమర్
తెలంగాణలో 1400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క కుటుంబాన్నైనా పరామర్శించారా? అంటూ పీసీసీ అధ్యక్షుడు, హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. శాసనసభలో రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలపై మాట్లాడితే మూతులపై కొట్టండని మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి అన్నారని... రైతులు పిట్టల్లా రాలిపోతుంటే, మంత్రులు ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు రుణాలను మాఫీ చేశామని, అప్పులపై మారటోరియం కూడా పెట్టామని గుర్తు చేశారు.