: ఓయూ హాస్టళ్లలో మళ్లీ ఖాకీల బూట్ల చప్పుళ్లు
అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఒకానొక రోజు పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలోకి చొరబడ్డారు. ఆందోళనను విరమించాలన్న తమ ఆదేశాలను లెక్కచేయకుండా తమపైనే విద్యార్థులు రాళ్ల దాడికి దిగడంతో సహనం నశించిన పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. హాస్టళ్లలోకి చొచ్చుకెళ్లిన పోలీసులు కనిపించిన విద్యార్థులను చితకబాదారు. దాదాపు గంటకు పైగా ఈ దాడి జరిగింది. ఈ దాడికి నేతృత్వం వహించారన్న కారణంగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు నాడు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఉస్మానియా యూనివర్సిటీ చల్లబడింది. అయితే ఇటీవల వరంగల్ జిల్లా మొద్దుగుట్ట అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఎంటెక్ విద్యార్థిని శృతి సహా విద్యాసాగర్ రెడ్డిలు చనిపోయారు. దీనికి నిరసనగా ప్రజా సంఘాలు నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ ఉద్యమంలో విద్యార్థి సంఘాలు పాలుపంచుకుంటున్నాయి. అసెంబ్లీ ముట్టడిని నిలువరించేందుకు నిన్న రాత్రే రంగంలోకి దిగిన పోలీసులు ఉస్మానియా వర్సిటీలోని పలువురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. నేటి ఉదయం అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరిన ఓయూ విద్యార్థినులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం యూనివర్సిటీ హాస్టళ్లలోకి పోలీసులు ప్రవేశించారు. విద్యార్థి సంఘం నేతల కోసం గాలింపు పేరిట మరోమారు వర్సిటీ హాస్టళ్లలోకి అడుగుపెట్టిన పోలీసులను విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంతో మరోమారు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.