: హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్... ‘పద్మావతి’లో ఉద్రిక్తత
‘స్థానిక’ కోటా విషయంపై తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలలో నేటి ఉదయం కలకలం రేగింది. కళాశాలలో రాయలసీమకు దక్కాల్సిన సీట్లను ప్రభుత్వం జారీ చేసిన ఓ జీవోను కారణంగా చూపిన కళాశాల అధికారులు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర విద్యార్థులకు కట్టబెట్టిన విషయంపై ఇటీవల పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. నాడు దీనిపై దృష్టి సారించిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ‘సీమ’ విద్యార్థులకు 18 సీట్లను కొత్తగా కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక నూతన విధివిధానాలతో మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించింది. హైకోర్టు సూచనతో నేటి ఉదయం కౌన్సిలింగ్ ను ప్రారంభించిన అధికారులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. 18 సీట్లను ‘సీమ’ విద్యార్థులకు కేటాయించాలని కోర్టు చెబితే, అందుకు భిన్నంగా 10 సీట్లనే భర్తీ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.