: కాబోయే ముఖ్యమంత్రి హరీశ్ రావు!... టీ అసెంబ్లీలో విపక్ష సభ్యుల ఆసక్తికర కామెంట్లు
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. ఐదేళ్ల దాకా అధికారాన్ని కట్టబెట్టారు. మరి తెలంగాణకు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ప్రజలను ఇప్పుడే ఈ విషయంపై ప్రశ్నలు సంధిస్తే మిశ్రమ స్పందన వస్తుంది కానీ, రాష్ట్రంలోని విపక్షాల ఎమ్మెల్యేలను అడిగితే మాత్రం... రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావే తదుపరి సీఎం అనే సమాధానం వస్తుంది. ఇదేదో పిచ్చాపాటి కబుర్లలో నేతలు చెప్పిన విషయం ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నిన్న విపక్ష ఎమ్మెల్యేలు కొందరు ఈ మేరకు సభలో ఆసక్తికర కామెంట్లు విసిరారు. విషయంలోకి వస్తే... నిన్న రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడేందుకు సిద్ధమవుతున్న సమయంలో సీఎం కేసీఆర్ సభ నుంచి బయటకు వెళ్లేందుకు తన సీట్లో నుంచి లేచారు. దీనిని గమనించిన ఎర్రబెల్లి ‘‘సీఎంగారు సభలో ఉండాలని కోరుకుంటున్నాం. నేను చెప్పేది ఆయన వినాలని అనుకుంటున్నాను’’ అని అన్నారు. వెనువెంటనే విపక్షాలకు చెందిన సీట్లలోని కొందరు సభ్యులు ‘‘కాబోయే సీఎం ఉన్నారులే. ఆయన వింటారులే’’ అంటూ మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.