: దమ్ముంటే... మీ ఆస్తులను వెల్లడించండి: జగన్ కు పయ్యావుల సవాల్
ఏపీలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధైర్యముంటే తన ఆస్తులు వెల్లడించాలని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు. నిన్న విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన జగన్ పై విరుచుకుపడ్డారు. మొన్నటి ఎన్నికల సందర్భంగా జగన్ తప్పుడు ధ్రువీకరణలతో కూడిన అఫిడవిట్ ను ఎన్నికల సంఘానికి సమర్పించారని ఆరోపించారు. ఈ విషయంపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తన ఆస్తుల్లో కొన్నింటిని మాత్రమే ప్రకటించిన జగన్... హైదరాబాదులోని లోటస్ పాండ్ ను కాని, బెంగళూరులో 26 ఎకరాల్లో నిర్మించుకున్న భవనాన్ని కాని అందులో పేర్కొనలేదని ఆరోపించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై గత పదేళ్లుగా కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చంద్రబాబు ఆస్తులపై కేసులు దాఖలు చేశారని, అయితే ఆ కేసుల్లో తనకు అపజయం తప్పదన్న భావనతోనే ఆయన వాటిని వెనక్కు తీసుకున్నారని పయ్యావుల చెప్పారు.