: హైదరాబాదులో టెన్షన్... టెన్షన్: ప్రజా సంఘాల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో భారీ భద్రత
వరంగల్ జిల్లా మొద్దుగుట్ట ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ, ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ కావాలంటూ డిమాండ్ చేస్తూ 400 ప్రజా సంఘాలు కలిసికట్టుగా చేపట్టనున్న అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో హైదరాబాదులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి నుంచి ప్రజా సంఘాల నేతలపై దృష్టి సారించిన పోలీసులు భారీ ఎత్తున సోదాలు చేపట్టారు. కనిపించిన ప్రజా సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోనూ సోదాలు చేసిన పోలీసులు పలువురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక నేటి తెల్లవారుజామున విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన అప్పటికే బయటకు వెళ్లిపోయారు. దీంతో వరవరరావు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఎలాగైనా ప్రజా సంఘాల అసెంబ్లీ ముట్టడిని తిప్పికొట్టాలని పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. మరోవైపు తాము చేపట్టనున్న నిరసన ప్రదర్శనను ఎలాగైనా చేసి తీరతామని ఓ ప్రైవేట్ టీవీ చానెల్ తో మాట్లాడుతూ వరవరరావు చెప్పారు. తమది అసెంబ్లీ ముట్టడి కాదని, ‘అసెంబ్లీ వరకు పాదయాత్ర’ అని ఆయన ప్రకటించారు. శాంతియుతంగా చేపట్టనున్న పాదయాత్రను ఎలా అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.