: సంస్థ మేనేజరే చోరీకి సూత్రధారి!
బక్రీద్ పండుగ రోజున చోరీ చేస్తే ఎవరికీ పట్టుబడే అవకాశం లేదన్న చోరుల నమ్మకాన్ని పోలీసులు వమ్ముచేశారు. తమిళనాడులోని దిండిగల్ జిల్లా బట్లగుండులో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. ఈ సందర్భంగా 6.5 కేజీల బంగారు నగలు, 8.5 లక్షల నగదు తస్కరించి, నకిలీ నగలు పెట్టినట్టు సదరు కార్యాలయ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముందుగా సిబ్బందిని విచారించిన పోలీసులు కేసును ఛేదించారు. విచారణ సందర్భంగా మేనేజర్, మరో ఉద్యోగిని వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు, వారిని సుదీర్ఘంగా విచారించి నిజం కక్కించారు. బక్రీద్ రోజున చోరీ చేస్తే ఎవరికీ అనుమానం రాదని భావించిన మేనేజర్, అదే ఆఫీసులోని ఉద్యోగితో కలిసి పథకం రచించారు. బంగారం నగలను దొంగిలించి, వాటి స్థానంలో గిల్టునగలు పెట్టి, ఏమీ తెలియనట్టు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారిస్తున్నామని వారు తెలిపారు.