: బాలుడి భవిష్యత్తుకు బాటలు పరచిన సోషల్ మీడియా


సోషల్ మీడియా ఓ బాలుడి భవిష్యత్తుకు బాటలు పరచింది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో హరేంద్ర సింగ్ అనే బాలుడు 9వ తరగతి చదువుకుంటున్నాడు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో హరేంద్ర సింగ్ నోయిడా మెట్రో రైల్వే స్టేషన్ లో బరువు తూకపు యంత్రం పెట్టుకుని, పక్కనే కూర్చుని క్లాసు హోం వర్క్ చేసుకునేవాడు. అటుగా వెళ్లే వారు చిల్లర వేసి దానిపై నిలబడి బరువు కొలుచుకుని వెళుతుంటారు. ఇలా హరేంద్ర సింగ్ రోజూ సుమారు 70 రూపాయలు సంపాదించేవాడు. ఆ డబ్బుల నుంచి తన చదువుకు అవసరమయ్యేవి తీసుకుని, మిగతావి ఇంట్లో ఇచ్చేవాడు. ఓ రోజు అదే ప్రాంతానికి చెందిన వికాస్ షర్దా అనే ప్రయాణికుడు అటుగా వెళ్తూ, శ్రద్ధగా హోం వర్క్ చేసుకుంటున్న హరేంద్ర సింగ్ ఫోటో తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ, 'బరువు కొలుచుకుని ఈ బాలుడి విద్యకు తోడ్పడండి, దయచేసి ఎవరూ అతడిని అడుక్కునేవాడిలా చూడకండి' అంటూ వ్యాఖ్యను జోడించాడు. దీంతో ఆ ఫోటో వైరల్ అయ్యింది. ఇది యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ దృష్టికెళ్లింది. దీంతో బాలుడికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో పాటు అతడి విద్యకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. తన ఇబ్బందులు అందరికీ తెలిసేలా చేసిన వికాస్ కు హరేంద్ర సింగ్ కృతజ్ఞతలు తెలిపాడు.

  • Loading...

More Telugu News