: ప్రత్యేక హోదా ఇచ్చే క్రమంలో ఇబ్బందులుంటాయని మాత్రమే కేంద్రం చెప్పింది: ఏపీ మంత్రి పల్లె
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని మాత్రమే చెప్పిందని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈరోజు అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై పల్లె ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కావాలనే ఇరికించారని మండిపడ్డారు. చంద్రబాబుతో పోటీపడలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందని చెప్పారు. ఇప్పటి వరకు చంద్రబాబుపై 25 కేసులు నమోదయ్యాయని... విచారణలు కూడా జరిగాయని... అయినా, ఏ ఒక్క కేసులో కూడా చంద్రబాబు తప్పుచేసినట్టు రుజువు కాలేదని చెప్పారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె వద్ద ఉన్న ఎరువుల కర్మాగారం కాలుష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో అనంతపురం జిల్లా ఇండస్ట్రియల్ హబ్ గా రూపాంతరం చెందుతుందని తెలిపారు.