: లోకేష్ ప్రకటించిన ఆస్తులను టీడీపీ కార్యకర్తలు కూడా నమ్మడం లేదు: అంబటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఇటీవల తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాలను వారి కుటుంబ సభ్యులే కాకుండా, టీడీపీ కార్యకర్తలు కూడా నమ్మడం లేదని అన్నారు. హైదరాబాదులో ఐదెకరాల భూమి ఎక్కడైనా రూ. 71 లక్షలకు వస్తుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తులను రూ. 45 లక్షలకు కొనడానికి తాను సిద్ధంగా ఉన్నానని... అమ్మడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ స్థలాలు పక్కపక్కనే ఉన్నా వాటి విలువల్లో మాత్రం తేడాలు చూపిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు భార్య, కుమారుడికి కలిపి హైటెక్ సిటీ దగ్గర పదెకరాల స్థలం ఉందని... 'దాని విలువ కోటిన్నరే అట' అంటూ ఎద్దేవా చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రత్యేకంగా ఆస్తులు ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్లలో ఆ వివరాలన్నీ ఉంటాయని చెప్పారు. ఏపీలో అత్యధికంగా అవినీతి చోటు చేసుకుంటోందని విమర్శించారు. సింగపూర్ తో చేతులు కలిపి వేల కోట్లను సొంతం చేసుకుంటున్నారని ఆరోపించారు. పాలు, కూరగాయలు అమ్మి కోట్లను సంపాదించడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు.