: ఆన్ లైన్ మోసం... సెల్ ఫోన్ బుక్ చేస్తే ఐరన్ లాకెట్ పంపారు!
ఆన్ లైన్ మోసం మరోసారి బయటపడింది. ఓ వ్యక్తి ఆన్ లైన్ లో సెల్ ఫోన్ బుక్ చేస్తే... పోస్టులో మరేదో రావటం చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జెండావీధికి చెందిన మహ్మద్ హుసేన్ అలియాస్ డాన్స్ గోరాకు ఈ నెల 23వ తేదీన ఓ ఫోన్ వచ్చింది. తాము ఢిల్లీ ప్రథమరత్న ఆస్ట్రాలాజిక్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, సామ్ సంగ్ గ్రాండ్ మొబైల్ భారీ ఆఫర్ ఇస్తోందని చెప్పారు. తమ వద్ద మొబైల్ అసలు రేటు రూ.8,400 అయితే ఆఫర్ డిస్కౌంట్ పోను కేవలం రూ.3వేలకే ఇస్తున్నామని అతనికి చెప్పారు. అయితే ఇప్పుడే డబ్బు చెల్లించాల్సిన అవసరం కూడా లేదని, పోస్టులో వచ్చాక పోస్టల్ అధికారులకే డబ్బు చెల్లించమని చెప్పారు. ఇదేదో బాగుందనుకున్న గోరా వెంటనే మొబైల్ బుక్ చేశాడు. తరువాతి రోజున మీకో పార్సిల్ వచ్చిందని పోస్టల్ అధికారులు ఫోన్ చేసి చెప్పారు. గోరా పోస్టాఫీసుకు వెళ్లి మూడు వేలు చెల్లించి తన పార్సిల్ బాక్స్ తీసుకున్నాడు. ఆతృతతో బాక్స్ ను అక్కడే తెరిచి చూస్తే ఓ ఐరన్ లాకెట్ దర్శనమిచ్చింది. అవాక్కైన గోరా తనకు ఫోన్ చేసిన వారికి వెంటన్ ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని చెప్పింది. అప్పుడే తెలిసింది అతనికి తాను నిండా మోసపోయానని!