: పాక్ నుంచి దేశంలోకి చొరబడ్డ 20 మంది ఉగ్రవాదులు... ఢిల్లీపై దాడికి అవకాశం!
పాకిస్థాన్ నుంచి సరిహద్దులు దాటి పంజాబ్ లోకి ప్రవేశించిన ఉగ్రవాద మూక దేశ రాజధానిపై దాడులు జరిపే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మొత్తం 20 మంది వరకూ వచ్చారని, వీరికి ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్) శిక్షణ ఇచ్చి పంపిందని, వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయీద్ సూచనల మేరకు వీరు దాడులు జరపవచ్చని భావిస్తూ, ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తనిఖీలను విస్తృతం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీరులోని లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజబుల్ ముజాహిద్దీన్ తదితరాలతో సమావేశాలు జరిపిన ఐఎస్ఐ అధికారులు ఇండియాలోకి చొరబడిన వారికి ఎటువంటి సాయం చేయాలన్న విషయమై చర్చించారని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ ప్లాన్ లో సిక్కు టెర్రర్ గ్రూపులు బబ్బర్ ఖాస్లా ఇంటర్నేషనల్, ఖలిస్థాన్ జిందాబాద్ లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిసినట్టు అధికారులు తెలిపారు. ఖలిస్థాన్ జిందాబాద్ దళం చీఫ్ రంజిత్ సింగ్, గత రెండు నెలలుగా ఐఎస్ఐ శిక్షణ తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం పంజాబ్ లో ఉన్న వీరికి జమ్ము కాశ్మీర్ నుంచి ఆ రాష్ట్రానికి వచ్చే లారీల ద్వారా ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన భారత ఇంటెలిజన్స్ వర్గాలు నిఘాను మరింతగా పెంచాయి.