: ఆత్మహత్యలపైనే చర్చించాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఎప్పుడూ నెగెటివ్ ఆలోచనలేనా?: కేసీఆర్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. వెంటనే సభ గందరగోళంగా మారింది. రైతుల ఆత్మహత్యలపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలపైనే చర్చించాలని ఎందుకు పట్టుబడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడూ నెగెటివ్ ఆలోచనలేనా? అంటూ ప్రశ్నించారు. రైతు సమస్యలపై చర్చిద్దామని బీఏసీలో నిర్ణయించామని... అందువల్ల, సమయం వృథా కాకుండా సమస్యలపై చర్చ జరుపుదామని చెప్పారు. విపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలను ఇస్తే స్వీకరిస్తామని అన్నారు. మరోవైపు, మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, రైతులకు ఈ గతి పట్టడానికి మీరే కారణం అంటూ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. మీ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే, ఆత్మహత్యల పేరుతో సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంలో, సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ, అధికార పక్షం వైఖరేంటో పూర్తిగా అర్థమవుతోందని మండిపడ్డారు. చర్చ ప్రారంభం కాకుండానే... రైతుల పరిస్థితికి మీ పరిపాలనే కారణమని ఆరోపిస్తున్నారని... ఈ రకమైన వ్యూహంతో విపక్షాలను కట్టడి చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.