: ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నేడే... రెపో రేటుపై రాజన్ నిర్ణయంపై ఆసక్తి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆధ్వర్యంలో నేడు జరగనున్న ద్రవ్య పరపతి సమీక్షపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా దృష్టి సారించాయి. ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో కీలక వడ్డీ రేట్లను సవరిస్తారన్న ఊహాగానాలు సాగుతున్నాయి. వడ్డీ రేటులో పెద్దగా మార్పులేమీ ఉండకపోయినా, కనీసం పావు శాతమైనా తగ్గించేందుకే రాజన్ నిర్ణయం తీసుకుంటారన్న వాదనా వినిపిస్తోంది. అయితే అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ లోగా తన వడ్డీ రేట్లను పెంచుతుందన్న పుకార్లే కాక రుతు పవనాలు ముఖం చాటేయనున్న వార్తల నేపథ్యంలో మళ్లీ ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపునకు దాదాపుగా నిర్ణయం తీసుకున్న రాజన్ చేతులకు ఈ రెండు అంశాలు కళ్లెం వేస్తాయని ప్రచారం కూడా సాగుతోంది.