: టీఆర్ఎస్ లోకి టీడీపీ, కాంగ్రెస్ నేతలు
మెదక్ జిల్లాకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలు పలువురు టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో మనూరు మండలంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, ఐదుగురు సర్పంచ్ లతో పాటు సుమారు 1000 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిషన్ కాకతీయ భాగంలో మనూరులోని ఏడు చెరువులను రూ.16.40 కోట్ల వ్యయం చేసి అభివృద్ధి చేస్తామని అన్నారు. మనూరులో 30 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని, మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తామని, రూ.66 కోట్లతో నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రోడ్లను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.