: ఊపందుకున్న నిమజ్జనం... టెలిఫోన్ భవన్ వద్దకు మహా గణపతి
జంటనగరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం ఊపందుకుంది. ఈ మధ్యాహ్నం వరకూ నిదానంగా సాగిన శోభాయాత్ర, రెండు గంటల తరువాత చకచకా కదలడం కనిపించింది. ఒక్క ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డు పరిసరాలు, అబీడ్స్, కోటీ, లిబర్టీ, నారాయణగూడ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను పునరుద్ధరించామని, సాయంత్రానికి ట్యాంక్ బండ్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మామూలు రోజుల్లోలా ఉంటుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, ఖైరతాబాద్ లో వెలసిన మహా గణపతి నిమజ్జన యాత్ర నిదానంగా కదులుతూ లక్డీకాపూల్ లోని టెలిఫోన్ భవన్ సమీపానికి చేరుకుంది. సచివాలయం నుంచి నాంపల్లి వరకూ విగ్రహాలు బారులుతీరి ఉండటంతో మరో రెండు గంటల తరువాత మాత్రమే మహా గణపతి ముందుకు కదలవచ్చని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోను నిమజ్జన వేడుకలను చీకటి పడేలోగా ముగించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.