: మాతృ దేశాన్ని వదిలేట్లయితే, అక్కడికి వెళ్లడమే బెస్ట్: హెచ్ఎస్బీసీ సర్వే
మాతృ దేశాన్ని వదిలి ఉపాధి నిమిత్తం వెళ్లాలంటే సింగపూర్ అత్యుత్తమమని, కుటుంబంతో సహా వెళ్లి జీవించాలని భావిస్తే స్వీడన్ బెస్ట్ దేశమని హెచ్ఎస్బీసీ తాజా అధ్యయనం తరువాత విడుదలైన సర్వే తెలిపింది. మొత్తం 39 దేశాల్లో ఉన్న 20 వేల మందికి పైగా విదేశీయుల ఆర్థిక, కుటుంబ పరిస్థితులు, జీవనశైలి, భద్రతపై వారు ఎదుర్కొన్న అనుభవాలు వంటి అంశాలపై ప్రశ్నించి ఆయా దేశాలకు ర్యాంకులను ప్రకటించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ 'యూగో'తో హెచ్ఎస్బీసీ చేయించిన ఈ సర్వే వివరాల ప్రకారం, ఆకర్షణీయ వేతనాలు లభించే దేశంగా 77 శాతం మంది స్విట్జర్లాండ్ ను పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు మెరుగైన జీవనానికి న్యూజిలాండ్ బెస్ట్ అని వెల్లడైంది. పిల్లల సంరక్షణ, వారికి విద్యావకాశాలు సులభంగా దగ్గర చేయాలంటే కెనడాకు వెళ్లాలని, కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకైతే లండన్, దుబాయ్, సింగపూర్ అనుకూలాలని వెల్లడైంది. సింగపూర్ లో పనిచేస్తున్న విదేశీయుల్లో 28 శాతం మంది సాలీనా రూ. 1.32 కోట్లను వేతనంగా పొందుతున్నారు. కెరీర్ పురోగతికి సింగపూర్ సరైన కేంద్రమని 59 శాతం మంది, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకముందని 79 శాతం మంది సర్వేలో పాల్గొన్నవారు వెల్లడించడం విశేషం.