: సెబీలో విలీనమైన ఎఫ్ఎంసీ... గంట కొట్టిన అరుణ్ జైట్లీ


ఆరు దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా రెండు ప్రధాన నియంత్రణా సంస్థల విలీనం జరిగింది. మూలధన మార్కెట్ల నియంత్రణా విభాగం సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా), కమోడిటీ మార్కెట్ రెగ్యులేటర్ ఎఫ్ఎంసీ (ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్)లు కలిసిపోయాయి. ఈ సందర్భంగా స్టాక్ మార్కెట్ ప్రారంభ సూచకంగా మోగించే సంప్రదాయ గంటను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొట్టారు. ఇకపై ఈక్విటీ విభాగంలో ఉన్న నిబంధనలో కమోడిటీ మార్కెట్లకూ వర్తిస్తాయని, ఈ విభాగంలో ఉన్న సంస్థలు, ట్రేడర్లు కొత్త నిబంధనలకు అడ్జస్ట్ అయ్యేందుకు ఒక సంవత్సరం పాటు సమయం ఉంటుందని ఈ సందర్భంగా సెబీ చైర్మన్ యూకే సిన్హా వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఎఫ్ఎంసీ నిబంధనల మేరకే లావాదేవీలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. మరింత పారదర్శకత, ట్రేడర్ల ప్రయోజనాల కోసమే సెబీ, ఎఫ్ఎంసీల విలీనం జరిగిందని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శశికాంత్ దాస్ వెల్లడించారు. సంస్కరణలు నిత్యమూ కొనసాగే ప్రక్రియని తెలిపిన ఆయన, రెండు నియంత్రణా సంస్థల విలీనానికి బడ్జెట్ వరకూ వేచి చూడక్కర్లేదని పేర్కొన్నారు. కాగా, 1988లో సెక్యూరిటీస్ మార్కెట్ ను నియంత్రించేందుకు ప్రారంభించబడ్డ సెబీ, 1992లో స్వతంత్ర సంస్థగా ఎదిగింది. ఎఫ్ఎంసీ 1953 నుంచి కమోడిటీ మార్కెట్లను నియంత్రిస్తున్నప్పటికీ, అధికారాలు మాత్రం స్వల్పమే. కమోడిటీ మార్కెట్లో 'డబ్బా ట్రేడింగ్' వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ విలీనం ట్రేడర్లకు మేలు కలిగిస్తుందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News