: 'డిజిటల్ ఇండియా' కోసం ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ చేసిన పని... మీరూ చూడండి!
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేస్తున్న 'డిజిటల్ ఇండియా'కు ఫేస్ బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ మద్దతు తెలుపుతూ, తన ఫేస్ బుక్ ప్రొఫైల్ చిత్రాన్ని మూడు రంగుల్లోకి మార్చారు. "డిజిటల్ ఇండియాకు మద్దతుగా నా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చాను. భారత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇంటర్నెట్ తదితర సేవలను అందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయం. ఈ విషయంలో మోదీతో ఫేస్ బుక్ మాధ్యమంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను" అని తన కామెంట్ ను పోస్టు చేశారు. తన ఫాలోవర్లు కూడా ఈ కార్యక్రమానికి మద్దతివ్వాలని అన్నారు. మూడు రంగుల భారత జెండా వెనుక నవ్వుతున్న మార్క్ చిత్రం ఇప్పుడు వైరల్ అవుతుండగా, ఇదే తరహాలో ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్చర్ మార్చుకోవాలని భావిస్తే, fb.com/supportdigitalindia కు వెళ్లాలి. మార్క్ చిత్రాన్ని చూసిన మోదీ, తాను కూడా ప్రొఫైల్ పిక్చర్ ను అదే తరహాకు మార్చుకున్నానని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని వేల మంది తమ ప్రొఫైల్ పిక్చర్లను మూడు రంగుల జెండా నీడకు మార్చుకున్నారు కూడా. మరి మీరు..?