: కొడుకు 100, కూతురు 500... అల్లుడు వెయ్యి కోట్లు: సోనియాపై మోదీ సెటైర్లు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్ల జడివాన కురిపించారు. అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలోని శాప్ సెంటర్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి కొద్దిసేపటి క్రితం ప్రసంగించిన సందర్భంగా మోదీ కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలపై పరోక్ష విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శల్లో ఆయన ఏ ఒక్కరి పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. తన ప్రసంగంలో రాజకీయ నేతలపై వస్తున్న ఆరోపణలను ప్రస్తావించిన మోదీ, అధికారం చేపట్టిన నేతపై కొద్దికాలానికే అవినీతి ఆరోపణలను రావడం సర్వసాధారణమైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొడుకు రూ.100 కోట్లు, కూతురు రూ.500 కోట్లు, అల్లుడు ఏకంగా రూ.1,000 కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి’’ అంటూ ఆయన సోనియాపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘‘ఈ తరహా ఆరోపణలు విని మీ చెవులు చిల్లులు పడ్డాయా? అవినీతిపై మీకు చికాకు పుట్టిందా? లేదా? నేను మీ మధ్య నిలబడి ఉన్నాను. నా మీద ఏవైనా ఆరోపణలున్నాయా?’’ అని ఆయన ప్రశ్నించారు. దీనికి ఎన్నారైల నుంచి ‘‘లేవు, లేవు’’ అన్న నినాదాలు వినిపించగా, ‘‘నాకు మీ నుంచి సర్టిఫికెట్ కావాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.