: ఇకపై ఎంపీల జీతాలు ఇష్టమొచ్చినట్లు పెరగవు
వ్యక్తిగత జీతాల పెంపునకు ఎంపీలు తమకు తాముగా నిర్ణయం తీసుకోకూడదన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఎంపీల జీతాలు, సౌకర్యాలపై ఈ కమిటీ అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించనుంది. కాగా, యూపీఏ-2 హయాంలో ఎంపీల జీతభత్యాల సవరణ జరిగింది. దీని ప్రకారం ఎంపీకి నెలకు రూ.50 వేలు జీతం వస్తుంది. ఇతర అలవెన్సుల విషయానికొస్తే... పార్లమెంట్ సమావేశాలకు హాజరైతే రోజుకు రూ.2 వేలు, నియోజకవర్గాల అలవెన్స్ కింద నెలకు రూ.45 వేలు, స్టేషనరీ కొనుగోలు కింద రూ.15 వేలు, స్టాఫ్ అసిస్టెన్స్ కింద రూ.30 వేలు అందుతాయి. ఎంపీలకు ప్రభుత్వ వసతితో పాటు విమాన, రైలు ప్రయాణాలు, రెండు మొబైల్ ఫోన్లు, మూడు ల్యాండ్ లైన్ సదుపాయాలు కల్పిస్తారు. వాహనం కొనుగోలుకు రూ.4 లక్షలు లోన్ గా ఎంపీలు తీసుకోవచ్చు.