: కర్ణాటకలో భారీ వర్షాలు... పొంగుతున్న పెన్నా, కుందూ, వేదావతి నదులు
కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని నదులను భారీ వరద ముంచెత్తింది. జిల్లాలోని వేదావతి, కుందు నదులు పొంగి పొరలుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నాలుగడుగుల మేరకు నీరు చేరడంతో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించింది. వలగుండ మండలం మార్లమడికి వద్ద వేదావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, నంద్యాల సమీపంలో కుందూ నదికి వస్తున్న వరద నీరు గంటగంటకూ పెరుగుతోంది. కుందూ నదిలో 14,200 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని కేసీ కాలువ డీఈఈ జిలానీ బాషా వివరించారు. పెన్నా నదిలో 13,140 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని తెలిపారు. ఇంకా వర్షాలు పడుతుండటంతో నీటి ప్రవాహం మరింతగా పెరగవచ్చని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.