: అబ్దుల్ కలాం పుస్తకావిష్కరణను అడ్డుకున్న ఫేస్ బుక్ పోస్టు


ఓ మహిళా అనువాదకురాలు తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన పోస్టు దివంగత అబ్దుల్ కలాం రచించిన పుస్తకావిష్కరణను అడ్డుకుంది. వివరాల్లోకి వెళితే, కలాం, ఆయన సైంటిస్టు ఫ్రెండ్ అరుణ్ తివారీలు కలసి "ట్రాన్సెండెన్స్: మై స్పిరిచ్యువల్ ఎక్స్ పీరియన్సెస్ విత్ ప్రముఖ్ స్వామి" పేరిట ఓ పుస్తకాన్ని రాశారు. ఇది గత జూన్ లో ఆంగ్లంలో ప్రచురితం కాగా, మలయాళంలోకి శ్రీదేవి ఎస్.కార్తా అనువదించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించిన 'కరెంట్ బుక్స్' సంస్థ దీని ఆవిష్కరణకు శ్రీదేవిని ఆహ్వానించలేదు. తనను ఈ కార్యక్రమం నుంచి బహిష్కరించారని, వేదికపై స్వామీజీ ఉండటం, ఆశ్రమ నిబంధనలను అనుసరించి ఓ మహిళ పక్కన తాను కూర్చోనని ఆయన చెప్పడమే ఇందుకు కారణమని ఆరోపిస్తూ, శ్రీదేవి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. దీంతో శ్రీదేవికి మద్దతుగా నెటిజన్లు కదిలారు. ఇది మహిళల పట్ల వివక్షేనని ఆరోపిస్తూ విమర్శలకు దిగడంతో పుస్తకావిష్కరణ వాయిదా పడింది. దీనిపై కరెంట్ బుక్స్ ఎండీ పీపీన్ థామస్ స్పందిస్తూ, "మేము ఆమెతో ఎప్పుడూ మాట్లాడలేదు. ఆమె తన కర్తవ్యాన్ని నిర్వహించారు. ఆమెను గురించి మేమేమీ కామెంట్స్ చేయలేదు. ఆమెను వేదికపైకి పిలవాల్సిన అవసరం లేదు" అని అన్నారు. సాధ్యమైనంత త్వరలో పుస్తకావిష్కరణ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News