: మక్కా ప్రమాదానికి యాత్రికులే కారణమంటున్న సౌదీ!
భద్రతా అధికారులు చేస్తున్న సూచనలు పాటించకుండా యాత్రికులు ముందుకు సాగడం వల్లే తొక్కిసలాట జరిగి ఉండవచ్చని సౌదీ ఆరోగ్య శాఖా మంత్రి ఫలీ అభిప్రాయపడ్డారు. ఈ దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 769కి పెరిగిందని ఆయన తెలిపారు. కాగా, ఈ ఘోర దుర్ఘటనలో మరణించిన భారతీయుల సంఖ్య 22కు చేరింది. ఇందులో గుజరాత్ కు చెందిన యాత్రికుల సంఖ్య 11. తొక్కిసలాట, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించాలని సౌదీ రాజు ఆదేశించారు. ఘటనపై దర్యాప్తు చేయడానికి ఓ కమిటీని నియమించాలని సూచించారు. ఇదిలావుండగా, సౌదీ ప్రమాదంలో మృతి చెందిన భారతీయులను గుర్తించేందుకు అక్కడి ఎంబసీ అధికారులతో కలసి కృషి చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలియజేశారు.