: గాంధీ ఆసుపత్రి, వైద్య కళాశాల సిబ్బంది ఘర్షణ
ఐడీ కార్డుల విషయమై హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి, వైద్య కళాశాల సిబ్బంది ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరు మెడికల్ సిబ్బందికి, ఐదుగురు సెక్యూరిటీ గార్డులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు..గాంధీ ఆసుపత్రిలో పని చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఒకరు ఆసుపత్రిలోకి క్యారేజితో వెళ్తుండగా అక్కడి సెక్యూరిటీ అడ్డుకున్నారు. ‘30 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేశా...నన్నే గుర్తుపట్టవా?’ అంటూ సదరు రిటైర్డు ఉద్యోగి అన్నారు. ఐడీ కార్డు చూపించమని సెక్యూరిటీ కోరాడు. ఐడీ కార్డు చూపించేందుకు నిరాకరించిన ఆ రిటైర్డ్ ఉద్యోగి లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో ఆయన్ని సెక్యూరిటీ తోసివేశాడు. దీంతో మెడికల్ సిబ్బందిని వెంట బెట్టుకుని రిటైర్డ్ ఉద్యోగి రావడాన్ని చూసిన సెక్యూరిటీ తమను కొట్టేందుకు వారందరూ వస్తున్నారని భావించడంతో వ్యవహారం ఘర్షణకు దారి తీసింది. సుమారు అరగంట పాటు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘర్షణకు పాల్పడిన వారితో గోపాలపురం ఏసీపీ చర్చిస్తున్నట్లు సమాచారం.