: నా తండ్రిది సహజ మరణం కాదు: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు
భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై ఆయన కుమారుడు అనిల్ శాస్త్రి సందేహాలను వ్యక్తం చేశారు. తన తండ్రిది సహజ మరణం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చనిపోయే సమయానికి ముఖం నీలం రంగులోకి మారిపోయిందని చెప్పారు. చనిపోయే సమయంలో తన తండ్రి ఉన్న గదిలో కనీసం బెల్ కాని, ఫోన్ కాని లేవని తెలిపారు. కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందలేదని మండిపడ్డారు. చనిపోయిన తర్వాత తన తండ్రి డైరీ కూడా కనిపించలేదని అన్నారు. తన తండ్రి మరణంపై ఓ విచారణ కమిటీ వేయాలని ఈ సందర్భంగా అనిల్ శాస్త్రి డిమాండ్ చేశారు. తన తండ్రికి సంబంధించిన ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాలని కోరారు. తన తండ్రి మరణించినప్పుడు అక్కడి భారత రాయబార కార్యాలయ సిబ్బంది కూడా నిర్లక్ష్యం వహించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ నగరంలో 1966 జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు.