: నేను క్షమాభిక్ష కోరలేదు: సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు తాజాగా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు క్షమాభిక్ష తిరస్కరించిన విషయం తెలిసిందే. దానిపై సంజయ్ స్పందించాడు. అసలు తాను క్షమాభిక్ష పిటిషనే పెట్టుకోలేదని స్పష్టం చేశాడు. తానుగానీ, తన కుటుంబ సభ్యులు గానీ గవర్నర్ కు, ప్రభుత్వానికి అటువంటి అర్జీ పెట్టుకోలేదని తెలిపాడు. దానికి సంబంధించి సంజూ తరపు న్యాయవాదులు హితేష్ జైన్, సుభాష్ జాదవ్ లు ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ ఖట్జూ ఆ పిటిషన్ ను దాఖలు చేశారని చెప్పారు. సంజయ్ తో పాటు 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న మిగతా దోషులకు కూడా క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆయన పిటిషన్ పెట్టారని వెల్లడించారు. కాగా మరికొన్ని రోజుల్లో సంజయ్ శిక్షాకాలం పూర్తి కావస్తుండగా క్షమాభిక్ష పిిటిషన్ ప్రశ్నే ఉత్పన్నం కాదని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇటీవలే నెలరోజుల పెరోల్ పై సంజయ్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.