: రియాల్టీ షో సరదా కోసం బాలుడి కిడ్నాప్, హత్య!
ముంబయ్ వెళ్లి ఒక పాప్యులర్ రియాలిటీ షోలో పాల్గొనాలని కలలు కన్న ఓ అబ్బాయి, అమ్మాయి కలసి అందుకు అవసరమైన డబ్బు కోసం అడ్డదారి తొక్కి, కిడ్నాప్,హత్యను మార్గంగా ఎంచుకున్నారు. చివరికి పోలీసులకు దొరికిపోయి, ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లారు. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీస్ అధికారి రాంధ్వా కథనం ప్రకారం..ముంబైలో పాప్యులర్ రియాల్టీ షో లో పాల్గొనాలనుకున్న 17 సంవత్సరాల ఒక అమ్మాయి, అబ్బాయి ఒక పథకం వేశారు. ఒక షోలో పాల్గొందామంటూ తమ డ్యాన్స్ ట్రూపుకే చెందిన 13 సంవత్సరాల బాలుడు స్వప్నేష్ గుప్తాకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 16న ఆ కుర్రాడిని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ తీసుకెళ్లారు. కిడ్నాప్ నకు పాల్పడిన వారి మిత్రుడి ఇల్లు ఉత్తరాఖండ్ లో ఉండటంతో ఒక రాత్రి అక్కడే ఉన్నారు. మర్నాడు అక్కడికి సమీపంలో ఉన్న రాణిఖేత్ కొండపైకి ఆ బాలుడిని తీసుకెళ్లారు. తర్వాత బాలుడి మెడకు బెల్టు బిగించి ఊపిరాడకుండా చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని కొండపై నుంచి కిందకు తోసేశారు. కొద్ది రోజుల తర్వాత వాళ్లిద్దరూ ఢిల్లీకి తిరిగి వచ్చారు. ‘మీ కుమారుడు మీకు దక్కాలంటే మాకు రూ.60 వేలు ఇవ్వాలి’ అంటూ స్వప్నేష్ తండ్రికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ కు దిగారు నిందితులు. దీంతో స్వప్నేష్ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.