: హార్దిక్ పటేల్ చెప్పేదంతా కట్టుకథలా ఉంది: గుజరాత్ హైకోర్టు
గుజరాత్ లోని పటేళ్లకు రిజర్వేషన్లు కావాలంటూ ఆందోళనలకు ఆజ్యం పోసిన యువనేత హార్దిక్ పటేల్ శైలిని గుజరాత్ హైకోర్టు తప్పుబట్టింది. గత మంగళవారం ఆరావళి జిల్లాలో ప్రజాసభ ముగిసిన తర్వాత హార్దిక్ పటేల్ అదృశ్యం అయ్యాడు. ఈ నేపథ్యంలో, హార్దిక్ అనుచరుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. ఈ కేసును విచారించిన డివిజన్ బెంచ్... తనను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారంటూ హార్దిక్ చెప్పేదంతా కట్టుకథలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. విలువైన కోర్టు సమయాన్ని అనవసరంగా వృథా చేస్తున్నట్టు ఉందని చెప్పింది. అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.