: ఆ ఆప్ నేత 'ప్రొఫెషనల్ క్రిమినల్': ఢిల్లీ పోలీసులు
పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే, మూడు రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఆప్ నేత సోమనాధ్ భారతి 'ప్రొఫెషనల్ క్రిమినల్'లా వ్యవహరిస్తున్నారని ఢిల్లీ పోలీసులు వ్యాఖ్యానించారు. సోమనాధ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై గత నెలలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా, దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రాంతంలో గత సంవత్సరం ఆఫ్రికా మహిళలపై జరిగిన దాడికి నేతృత్వం వహించారంటూ సోమనాధ్ పై మరో కేసును పోలీసులు పెట్టారు. కోర్టు ఆయన ముందస్తు బెయిలును తిరస్కరించినా లొంగిపోలేదని, ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లు మారుస్తూ, ఎక్కడున్నారన్నది తెలియకుండా జాగ్రత్త పడుతూ, పోలీసుల కళ్లుగప్పి ఆయన ఢిల్లీలో సంచరిస్తున్నారని జాయింట్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ వ్యాఖ్యానించారు. ఓ నిపుణుడైన నేరగాడిలా ఆయన అరెస్టును తప్పించుకుంటున్నారని, ఇలా ఎంతకాలం ఉండగలరో చూస్తామని ఆయన అన్నారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, సోమనాధ్ లొంగిపోవాలని కేజ్రీవాల్ సైతం సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.