: అమరావతిలో రూ. 200 కోట్లతో స్వర్ణ దేవాలయం... ఇస్కాన్ కు 81 ఎకరాలు అప్పగింత
నవ్యాంధ్ర రాజధాని అమరావతి సమీపంలో భారీ వ్యయంతో స్వర్ణ శ్రీకృష్ణ దేవాలయాన్ని నిర్మిస్తామని ముందుకు వచ్చిన ఇస్కాన్ కు 81.03 ఎకరాల భూమిని 99 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరానికి రూ. లక్షను లీజుగా నిర్ణయించింది. ఇక్కడ రూ. 200 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మిస్తామని ఇస్కాన్ దేవాలయాల సౌతిండియా ప్రెసిడెంట్ సత్య గోపీనాథ్ దాస్ తెలిపారు. ఈ ఆలయ నిర్మాణానికి దసరా రోజున ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మొత్తం ఐదు దశల్లో పనులు సాగుతాయని, తొలి దశలో హంస వాహనంపై శ్రీకృష్ణ స్వర్ణ దేవాలయం నిర్మిస్తామని, ఆపై రెండో దశలో రామలింగేశ్వర ఆలయం, గోవు విశ్వవిద్యాలయం, గోశాల, మూడో దశలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వేదిక్ కళాశాల, నాలుగో దశలో వెంకటేశ్వర స్వామి ఆలయం, వేదాంత ఆసుపత్రి, వృద్ధాశ్రమం, ఇంటర్నేషనల్ స్కూల్, ఐదవ దశలో వేణుగోపాల స్వామి ఆలయం, భోజనశాలలు, అతిథి గృహాలను నిర్మించనున్నట్టు వివరించారు.