: రామోజీ వద్దకు జగన్ ఎలా వెళ్లారంటే...!


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ‘ఈనాడు’ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుతో భేటీ అయ్యారు. తన బంధువు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో కలిసి జగన్ నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావుతో జగన్, భూమనలు దాదాపు గంటకు పైగా భేటీ అయ్యారు. అయినా పత్రికారంగంలో బద్ధ శత్రువులుగా ఉన్న జగన్, రామోజీల మధ్య భేటీకి నేపథ్యమేంటి? అసలు ఈ భేటీలో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? అన్న అంశాలపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రామోజీతో భేటీకి జగన్ వెళ్లడానికి గల ప్రాథమిక కారణమేంటంటే... భూమన కరుణాకరరెడ్డి ఇంటిలో త్వరలో ఓ శుభకార్యం జరగనుందట. ఈ కార్యానికి తాను రామోజీరావును కూడా ఆహ్వానించాలనుకుంటున్నానని జగన్ ముందు భూమన ప్రతిపాదన పెట్టారు. 'దానిదేముంది, పిలవండి' అంటూ జగన్ కూడా సానుకూలంగానే స్పందించారట. ఈ క్రమంలో తానే స్యయంగా వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చి వస్తానన్న భూమనతో, ‘నేనూ వస్తా’నంటూ జగన్ చెప్పారట. దీంతో షాక్ తిన్న భూమన 'నిజమేనా?' అని అడిగారట. 'ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? నీతో పాటు ఫిల్మ్ సిటీకి నేనూ వస్తా'నంటూ జగన్ చెప్పారట. అలా నిన్న వారిద్దరూ కలిసి నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావుకు భూమన ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం ముగ్గురూ కలిసి దాదాపు గంటకు పైగా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయన్న విషయంపై ఇరు వర్గాలు నోరు విప్పలేదు. ఈ భేటీ పూర్తిగా వ్యక్తిగతమైనదే కాక, కేవలం శుభకార్యానికి ఆహ్వానించేందుకే జగన్, భూమనలు రామోజీని కలిశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడటానికి వారు సాహసించడం లేదు.

  • Loading...

More Telugu News