: ఎక్కడికి వెళ్లాడో తెలియని రాహుల్ గాంధీపై నెటిజన్ల సెటైర్లివే!
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ, ముందస్తు సమాచారం లేకుండానే విదేశాలకు వెళ్లిన రాహుల్ గాంధీపై సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో జరుగుతున్న ఓ సదస్సుకు వెళ్లారని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నా, మరికొందరు లండన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ (రాణి రాజప్రాసాదం)కు వెళ్లారని అంటుంటే, కాదు, వాళ్ల అమ్మమ్మను చూసి వచ్చేందుకు ఇటలీ వెళ్లారని ఇంకొందరు అంటున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై వ్యంగ్య ట్వీట్లు వచ్చాయి. "ఉత్తరప్రదేశ్ లోని రైతులతో కొన్ని గంటలు మాట్లాడిన ఆయన అలసిపోయి, విశ్రాంతి నిమిత్తం విదేశాలకు వెళ్లారు" అని ఒకరు, "రైతులకు పంచేందుకు భూములను సేకరించేందుకు విదేశాలకు వెళ్లారు" అని ఇంకొకరు, "ఆయన ప్రపంచ నేత కాబట్టి బకింగ్ హామ్ ప్యాలెస్ పేదరికాన్ని పరిశీలించేందుకు వెళ్లుంటారులే" అని మరొకరు వ్యాఖ్యానించారు. విశ్రాంత కాంగ్రెస్ కు సెలవుల ఐకాన్ రాహుల్ అని, సెలవులు పెట్టడంలో ఆయన కొత్త విప్లవాన్ని తీసుకొచ్చారని, ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్లు చేస్తూ, తమ భావ ప్రకటనా హక్కును వినియోగించుకుంటున్నారు.