: కోలుకున్నా నిలబడలేకపోయిన 'బుల్'!
యూరప్ మార్కెట్ల నుంచి లభించిన ప్రోత్సాహంతో, అప్పటివరకూ నష్టాల్లో నడిచిన బెంచ్ మార్క్ సూచికలు పరుగులు పెట్టినప్పటికీ, ఆపై ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, ఒడిదుడుకుల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు నామమాత్రపు లాభాల్లో నిలిచాయి. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే 120 పాయింట్ల నష్టంలో ఉన్న సెన్సెక్స్ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో 130 పాయింట్ల లాభానికి వెళ్లింది. ఆపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించి లాభాలను తీసుకెళ్లినట్టు బీఎస్ఈ ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. దీంతో నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్ బుల్ అదే స్థాయిలో నిలవలేకపోయింది. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 40.51 పాయింట్లు పెరిగి 0.16 శాతం లాభంతో 25,863.50 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 22.55 పాయింట్లు పెరిగి 0.29 శాతం లాభంతో 7,868.50 పాయింట్లకు చేరాయి. నిఫ్టీ-50లో 27 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో మిడ్ కాప్ 0.22 శాతం, స్మాల్ కాప్ 0.58 శాతం పెరిగాయి. ఈ సెషన్లో లుపిన్, టాటా పవర్, హెచ్సీఎల్ టెక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, గెయిల్ తదితర కంపెనీలు లాభాలను నమోదు చేయగా, ఓఎన్జీసీ, ఎన్ఎండీసీ, కోల్ ఇండియా, టాటా మోటార్స్, టాటా స్టీల్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి.