: ఏపీకి సాయంపై సాయంత్రంలోగా ప్రకటన: కేంద్ర మంత్రి సుజనా చౌదరి
ఏపీకి సాయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి నేటి సాయంత్రంలోగా స్పష్టమైన ప్రకటన రానుందని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. రాష్ట్రానికి సాయంపై ఇప్పటికే నీతి ఆయోగ్ అధికారులతో రెండు సార్లు భేటీ అయ్యామని ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. భేటీలో భాగంగా తాము ప్రతిపాదించిన అంశాలపై నీతి ఆయోగ్ సానుకూలంగా స్పందించిందని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై నీతి ఆయోగ్ అధికారులు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతో చర్చిస్తున్నారన్నారు. ఆయా శాఖల నుంచి ప్రత్యేకంగా నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారని తెలిపారు. అవసరమైతే మరోసారి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యేందుకు యత్నిస్తున్నామని సుజనా తెలిపారు.