: గుంటూరులో హైటెన్షన్... జగన్ దీక్షా స్థలి వద్ద ఫ్లెక్సీల తొలగింపు
గుంటూరులో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి నగరంలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలని సంకల్పించారు. అయితే జగన్ దీక్ష కోసం ఆ పార్టీ నేతలు ఎంపిక చేసిన స్థలం రద్దీ ప్రాంతంలో ఉండటంతో దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో దీక్షా స్థలి వద్ద ఇప్పటికే ప్రారంభమైన ఏర్పాట్లు దాదాపుగా నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వం అనుమతి నిరాకరించినా దీక్ష చేస్తామని వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. దీంతో గుంటూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా దీక్షా స్థలి వద్ద వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో అక్కడి ఫ్లెక్సీలను తొలగించాలని వైసీపీ నేతలకు నేటి ఉదయం 9 గంటల వరకు గడువు ఇచ్చామని కార్పొరేషన్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ చెప్పారు. అయితే తమ ఆదేశాలను వైసీపీ నేతలు పాటించకపోవడంతో తామే ఫ్లెక్సీలను తొలగించాల్సి వచ్చిందని సీపీఓ పేర్కొన్నారు.