: చుట్టూ పోలీసులు, కారులో ఊపిరాడక నేను... ఏమైందంటే...: హార్దిక్ పటేల్


"చుట్టూ ఆయుధాలు ధరించిన పోలీసులు. నేనేమో కారులో కూర్చున్నాను. నన్ను బయటకు దిగనివ్వలేదు, కారును ముందుకు కదలనివ్వలేదు. నిన్న సాయంత్రం వరకూ కారులోనే కూర్చుండి పోయాను. ఇకపై నిరసన ర్యాలీలు చేపట్టవద్దని వారు నన్ను హెచ్చరించారు" అని గుజరాత్ పటేల్ వర్గం యువనేత హార్దిక్ పటేల్ వివరించారు. సాయంత్రం తరువాత పోలీసులు విడిచిపెట్టారని, ఆపై అహ్మదాబాద్ కు 60 కిలోమీటర్ల దూరంలోని విరంగామ్ కు చేరుకున్నానని తెలిపారు. తనను చుట్టుముట్టిన వాళ్లు పోలీసులని భావిస్తున్నానని, వారు పోలీసులు అవునో... కాదో తనకు పూర్తిగా తెలియదని అన్నారు. కాగా, హార్దిక్ ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాదులు నిన్న తెల్లవారుఝామున కోర్టు తలుపులు తట్టగా, హార్దిక్ ను తక్షణం హైకోర్టు ఎదుట హాజరు పరచాలన్న ఆదేశాలు జారీ అయిన సంగతి తెలిసిందే. ఆపై హార్దిక్ హల్వాద్ ప్రాంతంలో ఉన్నారని తెలిసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఆ తరువాత హల్వాద్ లో ఆయన లేడని తెలియడంతో కొంత ఆందోళన, ఉద్రిక్తత నెలకొంది. చివరికి విరంగామ్ లో హార్దిక్ కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టుకు వెళ్లి, తనను నిర్బంధించిన ఉదంతంపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేయనున్నట్టు హార్దిక్ తెలిపారు.

  • Loading...

More Telugu News