: చేతనైతే జగన్ దీక్షను అడ్డుకోండి... చంద్రబాబు సర్కారుకు జ్యోతుల నెహ్రూ సవాల్


ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి ప్రతిపక్ష వైసీపీ నేత సవాల్ విసిరారు. దమ్ముంటే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టనున్న దీక్షను అడ్డుకోవాలని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఘాటు వ్యాఖ్య చేశారు. నేటి ఉదయం తూర్పుగోదావరి జిల్లా గండేపల్లిలో పార్టీ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సందర్భంగా మాట్లాడిన జ్యోతుల ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జగన్ దీక్షను తలపెట్టారని ఆయన చెప్పారు. సదాశయంతో జగన్ చేస్తున్న దీక్షను భగ్నం చేసే యత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన హితవు పలికారు. యువభేరి సదస్సులో పాల్గొన్నారనే కారణంతో ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిని సస్పెండ్ చేసిన ఆంధ్రా వర్సిటీ అధికారులపై జ్యోతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ అధికారులు అధికార టీడీపీకి వత్తాసు పలకడం మానుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News