: బీసీసీఐ ‘పవర్’ ఎవరికి దక్కేనో?... మళ్లీ రంగంలోకి దిగిన శ్రీని


భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పగ్గాలు దక్కించుకునేందుకు ఆ సంస్థ మాజీ అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్ మళ్లీ రంగంలోకి దిగిపోయారు. బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా హఠాన్మరణంతో ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడి పదవి ఖాళీగా ఉంది. ఈ పదవిని మరోమారు దక్కించుకోవడం ద్వారా తన సత్తా చాటాలని శ్రీనివాసన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఐపీఎల్ లో జట్టు, అల్లుడు గురునాథ్ మెయప్పన్ పై వెల్లువెత్తిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఓటమి లేకుండానే బీసీసీఐ చీఫ్ పదవిని శ్రీని వదులుకోవాల్సి వచ్చింది. శ్రీని తప్పుకోవడంతో దాల్మియా బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా దాల్మియా మరణంతో ఖాళీ అయిన కుర్చీని దక్కించుకునేందుకు శ్రీని వర్గం పకడ్బందీగా పావులు కదుపుతోంది. ఈ మేరకు నేడు శ్రీని వర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇక ఐపీఎల్ చైర్మన్ గా ఉన్న రాజీవ్ శుక్లాను బీసీసీఐ పీఠంపై కూర్చోబెట్టేందుకు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్లాను తొలుత బీసీసీఐకి తాత్కాలిక అధ్యక్షుడిగా చేసి, ఆ తర్వాత పూర్తి స్థాయి బాసుగా మార్చాలన్నది ఠాకూర్ వ్యూహం. మరి ఈ పోటీలో ఎవరిని బీసీసీఐ పీఠం వరిస్తుందోనన్న అంశంపై క్రీడాలోకం ఆసక్తిగా గమనిస్తోంది.

  • Loading...

More Telugu News