: టీ-మంత్రి ఇంద్రకరణ్ కోసం రెండు రోజులుగా అర్చకుల ఎదురుచూపులు!
తెలంగాణలోని దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, సిబ్బంది వేతనాల పెంపుపై జరగాల్సిన సమావేశం రెండు రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తోంది. మొన్నటి నుంచి అర్చక సంఘాల ప్రతినిధులు, అధికారులు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చాంబరుకు వచ్చి గంటల తరబడి ఎదురుచూడటం, చివరికి మంత్రి బిజీగా ఉన్నారని సమాధానం రావడంతో చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లడం జరుగుతోంది. ఈ చర్చలు మంగళవారం జరిపేందుకు నిర్ణయించగా, మంగళవారం మంత్రి బిజీగా ఉన్నారని, బుధవారం రావాలని అర్చక ప్రతినిధులకు ఆ శాఖ అడిషనల్ కమిషనర్ రామకృష్ణారావు తెలిపారు. తిరిగి నిన్న ఇంద్రకరణ్ చాంబర్ బయట చాలాసేపు వేచిచూసిన తరువాత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి తీరికలేకుండా ఉన్నారని, అందువల్ల నేడు కూడా సమావేశం కుదరదని రామకృష్ణారావు స్పష్టం చేయడంతో అర్చకులు, ఆలయ ఉద్యోగుల ప్రతినిధులు ఉసూరుమంటూ వెళ్లిపోయారు. ఇక నేడైనా ఈ చర్చలు జరుగుతాయో? లేదో?