: సభను విపక్షాలు అడ్డుకుంటే... టీఆర్ఎస్ కే మేలు!: టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య
చర్చకు తావులేకుండా గడచిన అసెంబ్లీ సమావేశాలను సాంతం విపక్షాలు అడ్డగించిన తీరుపై తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నిన్న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికార పక్షం విపక్షాలకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే అధికార పార్టీ నేతలు భిన్నంగా ఆలోచిస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, అంబర్ పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి నిన్న ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సభను విపక్షాలు అడ్డుకుంటే అధికార పార్టీకే మేలని ఆయన వ్యాఖ్యానించారు. నిన్నటి సమావేశాల సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. మరి తన వాదనకు గల కారణాన్ని మాత్రం ఆయన వివరించలేదు.