: ఇక ఈటెల రాజేందర్ వంతు... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో 15 రోజుల పర్యటన
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పది రోజుల పాటు చైనాలో పర్యటించి వచ్చారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ సహా పలువురు ఎమ్మెల్యేలతో కలిసి చైనాలో పర్యటించిన కేసీఆర్, ఇటీవలే తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వంతు వచ్చింది. కేసీఆర్ చైనా పర్యటన కంటే కాస్తంత అధికంగా ఆయన 15 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అమలవుతున్న వ్యాట్, జీఎస్టీ తరహా పన్నుల విధానంపై అధ్యయనం కోసం ఆయన ఈ నెల 27న విమానమెక్కనున్నారు. రెండు దేశాల్లో సుదీర్ఘంగా పర్యటించనున్న ఆయన మళ్లీ వచ్చే నెల 11న తిరిగి హైదరాబాదు చేరుకుంటారు. ఈ మేరకు ఈటెల పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.