: నేడు పదవిలో, రేపు మాజీగా... ఎవరైనా అంతే: హరీష్ రావు
"నేడు పదవిలో వుంటాం. రేపు మాజీలు అవుతాం. రాజకీయాల్లో ఎవరైనా మాజీలుగా మారక తప్పదు" అని తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమస్యలను పరిష్కరించేందుకు ఈ మధ్యాహ్నం వారితో సమావేశమైన హరీష్ రావు, పింఛన్ల విషయమై త్వరలోనే తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కర్ణాటకలో మాజీలు అనుభవిస్తున్న సౌకర్యాలను ఇక్కడా దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. రాజకీయాల పరంగా మాజీలుగా మిగిలినా, ప్రజలకు సేవ చేయాలన్న కోరికను మాత్రం వదులుకోరాదని పిలుపునిచ్చిన ఆయన, అదే భవిష్యత్తులో మరోసారి పదవులను దగ్గర చేస్తుందని అన్నారు. కాగా, ఈ సమావేశానికి టీఎస్ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్ పర్సన్ స్వామిగౌడ్ తదితరులు హాజరయ్యారు.