: చంద్రబాబు ఇలాకాలో వింత శబ్దాలతో జనం బెంబేలు
పావుగంట పాటు చెవులు పోటెత్తే శబ్దాలు... ఏం పేలుతున్నాయో తెలీదు. ఎక్కడ పేలుతున్నాయో తెలీదు. కొందరు క్వారీ పేలుళ్లన్నారు. మరికొందరు ట్రాన్స్ ఫార్మర్లు వరుసగా పేలుతున్నాయని భావించారు. మరికొందరు రాకెట్టో, గ్రహశకలాలో భూమిని తాకుతున్నాయని భయపడ్డారు. పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు పెద్దగా కేకలు పెడుతూ బయటకు పరుగులు తీశారు. ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన ఈ ఘటన చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో నిన్న సాయంత్రం 3:45 నుంచి 4 గంటల మధ్య జరిగింది. కుప్పంతో పాటు సమీపంలోని 40 కిలోమీటర్ల దూరంలోని అన్ని పల్లెలకూ ఈ శబ్దాలు వినిపించాయి. విషయం తెలుసుకున్న గ్రామాల సర్పంచులు, ఫైర్ ఆఫీసర్లు, పోలీసులు ఆగమేఘాల మీద ఊర్లలోకి పరుగులు పెట్టారు. అధికారులు గ్రామాలకు ఫోన్లు చేసి వివరాలు అడిగారు. ఎక్కడా ఏమీ జరగలేదని తేల్చారు. తామూ శబ్దాలు విన్నామని, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదని కుప్పం ఎమ్మార్వో అబ్దుల్ మునాఫ్, సీఐ రాజశేఖర్ వివరించారు. తమిళనాడు సరిహద్దుల్లో పేలుళ్లు జరిగివుండవచ్చని భావిస్తున్నా, అది కూడా నిర్ధారణ కాలేదని వివరించారు.