: మరింత వడ్డన!... స్వచ్ఛ భారత్ కోసం పన్నులు పెంచాల్సిందే: చంద్రబాబు
ప్రజలపై మరింత పన్నుల భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపనున్నాయా? నేటి నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశం తరువాత చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు పరిశీలిస్తే నిజమే అనిపిస్తోంది. ఇండియాను పరిశుభ్రం చేసే దిశగా మోదీ తలపెట్టిన 'స్వచ్ఛ భారత్'కు నిధుల కోసం టెలికం, పెట్రోలు, ఖనిజాలపై స్వచ్ఛ భారత్ సెస్ ను విధించాలని చంద్రబాబు సిఫార్సు చేశారు. చంద్రబాబు అధ్యక్షతన నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశం ముగియగా, అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, నిధుల కోసం కొంత పన్నుల భారం మోపాలని తమ కమిటీ సూచించిందని తెలిపారు. సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల సీఎంలు స్వచ్ఛ భారత్ పై వ్యక్తిగతంగా సూచనలు, సలహాలు ఇచ్చారని వివరించారు. వచ్చే ఐదేళ్లలో స్వచ్ఛ భారత్ కల సాకారం చేస్తామని, వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రధానంగా దృష్టిని సారించామని తెలిపారు. వ్యర్థాలతో విద్యుత్ తయారీకి చర్యలు చేపట్టి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తమ కమిటీ సిఫార్సు చేసిందని తెలియజేశారు. వ్యర్థాల వల్ల భూగర్భ జలం కలుషితం అవుతోందని, చెత్త సేకరించి విద్యుత్ ప్లాంట్లకు చేరవేసే బాధ్యత మునిసిపల్ అధికారులదేనని పేర్కొన్నారు. ఇందుకయ్యే వ్యయాన్ని భరించేందుకు 75:25 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్రాలు నిధులను కేటాయించాలని అన్నారు. గ్రామ స్థాయి నుంచి స్వచ్ఛ భారత్ మిషన్లు ప్రకటించాలని, మొత్తం తమ సిఫార్సులపై 10 రోజుల్లో ప్రధానికి నివేదిక ఇస్తామని అన్నారు. మరుగుదొడ్లు లేకుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని, కాలుష్య నియంత్రణ చట్టాలను పునః పరిశీలించాలని కూడా సిఫార్సులు చేయనున్నట్టు చంద్రబాబు తెలిపారు.