: ఆ పెళ్లి కూతురి సాహసం అద్భుతం!
ఓ యువతి సాహసానికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. సమయస్పూర్తితో ఓ వ్యక్తిని ఆమె కాపాడిన తీరు అందరినీ ముగ్ధులను చేస్తోంది. ఆమే చైనాకు చెందిన గూ యాన్ యాన్. ఇంతకీ యాన్ చేసిన సాహసమేంటి? అనేగా మీ డౌట్. మరికాసేపట్లో లీ చాంగ్ అనే వ్యక్తితో తనకు వివాహాం జరగనుంది. ఈ సమయంలోనే మరో వ్యక్తి ప్రాణాలను కాపాడటమే ఆమె చేసిన సాహసం. దాంతో ఇప్పుడామె అత్యంత అందమైన పెళ్లి కూతురంటూ అంతా మెచ్చుకుంటున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, పెళ్లి కూతురు వస్త్రాల్లో అందంగా తయారైన యాన్ మిలమిలా మెరుస్తోంది. చైనాలోని ఓ సముద్ర తీరంలో వయ్యారంగా ఫోటోలకు పోజులిస్తోంది. ఇంతలో సముద్రంలో ఓ వ్యక్తి మునిగిపోతున్నట్టు ఆమెకు కనిపించాడు. స్విమ్మింగ్ చేస్తున్న ఆ వ్యక్తి అకస్మాత్తుగా అచేతనంగా ఉన్నట్టు గమనించింది. వెంటనే పరిగెత్తుకు వెళ్లిన యాన్, అతడిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చింది. అప్పటికే అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని గమనించింది. అయితే ఏమాత్రం ఆందోళన పడకుండా అతనికి తన నోటి ద్వారా కృత్రిమ శ్వాస అందించడం, ఛాతి భాగంలో చేతులతో గట్టిగా నొక్కడం చేసింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. చైనాలోని డాలియన్ సెంట్రల్ ఆసుపత్రిలో నర్సుగా యాన్ పనిచేస్తోంది. ఈ అనుభవమే ఆమెకు సమయస్పూర్తితో వ్యవహరించేలా చేసి వ్యక్తి ప్రాణాలను రక్షించేందుకు తోడ్పడింది. ఇప్పుడామెను చైనా స్థానిక మీడియా పోగడ్తలతో ముంచెత్తుతోంది. అందమైన పెళ్లి కూతురంటూ మెచ్చుకుంటున్నారని స్థానిక మీడియా పేర్కొంది. అటు యాన్ ను పెళ్లాడనున్న చాంగ్ కూడా తనకు కాబోయే భార్య సాహసానికి తెగ మురిసిపోతున్నాడు. చాలా గర్వంగా ఉందని, తన కంటే వేగంగా పరిగెత్తి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిందని సంతోషం వ్యక్తం చేశాడు. నిజంగా ఆ పెళ్లి కూతురి సాహసం అద్భుతం కదా!