: మరింత కుదేలు... చైనాలో ఊహించలేనంత మాంద్యం: హెచ్చరించిన ఐఎంఎఫ్
చైనాలో నెలకొన్న మాంద్యం బాహ్య ప్రపంచం ఊహించినదానికన్నా ఎంతో పెద్దదని, చైనా పరిస్థితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేయవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. "ఆసియా రీజియన్లో చైనా ప్రభావం మరింతగా పడనుంది. ముందనుకున్న స్థాయికన్నా ఇది ఎక్కువగా ఉంటుంది" అని వాషింగ్టన్ లోని బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూషన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డే వ్యాఖ్యానించారు. చైనాలో మార్కెట్లు పతనమవుతున్న కొద్దీ రిస్క్ పెరుగుతున్నట్టేనని ఆమె అభిప్రాయపడ్డారు. వృద్ధి రేటు తగ్గడం మరింత ఆందోళనను కలిగిస్తోందని వివరించారు. చైనా మాంద్యంతో కమోడిటీ మార్కెట్ నష్టపోయిందని, దీంతో ఎగుమతి ఆధారిత దేశాల వ్యవస్థలు ఒత్తిడిలోకి జారి పోయాయని ఆమె గుర్తు చేశారు. చైనా ప్రధాని జిన్ పింగ్ తొలిసారిగా యూఎస్ లో పర్యటిస్తున్న వేళ లగార్డే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.