: నిరుద్యోగులు పెరగడానికి మహిళలే కారణమట... పదో తరగతి విద్యార్థులకు పాఠాలు!


చత్తీస్ గఢ్ లోని పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో ఉన్న వాక్యాలు బీజేపీ ప్రభుత్వాన్ని మరో ఇబ్బందిలో పడేశాయి. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగడానికి కారణం, పనిచేస్తున్న మహిళలు నానాటికీ పెరుగుతుండటమేనని ఆ పుస్తకాల్లో ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మహిళలు అన్ని రంగాల్లోకీ వచ్చేశారని, దాంతో పురుషులకు ఉపాధి లభించకనే నిరుద్యోగుల సంఖ్య పెరిగిందని విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఈ సంవత్సరం వచ్చిన ఈ పుస్తకాల్లోని పాఠ్యాంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఓ టీచర్ ఇదే విషయాన్ని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ దృష్టికి తీసుకెళ్తామని కమిన్ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థుల పుస్తకాల్లో ఇటువంటి తప్పుదారి పట్టించే అంశాలు ఉండటం ఇదే తొలిసారి కాదు. గతంలో పశ్చిమ బెంగాల్ పుస్తకాల్లో స్వాతంత్ర్య సమరయోధులను 'టెర్రరిస్టు'లుగా అభివర్ణించి ఆ రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు 2012లో మాంసాహారం తినేవారు మోసాలు చేస్తారని, నేరగాళ్లని సీబీఎస్ఈ స్కూల్ టెక్ట్స్ బుక్ లో ప్రచురితం కాగా, ఆ ఘటన అప్పట్లో దేశవ్యాప్త చర్చకు దారితీసింది.

  • Loading...

More Telugu News